జనవరి 12- స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా....
వివేక వాణి - సత్య శారద
బలమే జీవము.బలహీనతే మరణం. ఆత్మవిశ్వాసమే జీవితానికి ఇంధనం. దృఢ సంకల్పంతో చేపట్టిన కార్యాలను విజయవంతంగా నిర్వహిస్తూ నిన్ను నువ్వు నిరూపించుకో. మనిషిగా మసులుకొంటూ మానవీయ విలువల్ని చాటుకో! అంటూ యువతకు సందేశ స్ఫూర్తిని అందించిన చైతన్య దీప్తి- స్వామి వివేకానంద! యువతే ఈ దేశానికి భవిత. యువత వల్లనే ఈ దేశం పురోగతి సాధిస్తుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రగతి పదం వైపు పయనిస్తుంది..అని స్వామి వివేకానంద సందేశమిచ్చారు.
యువత- భవిత
యువతరం నిరంతరం సానుకూల దృక్పథంతో, సవ్యమైన ఆలోచన ధోరణితో మసలు కొంటూ, తమ కర్తవ్యాలను నిర్వహిస్తూ, జాతి పురోభివృద్ధిలో మమేకం కావాలి..అని ఆయన పిలుపునిచ్చారు. యువత ఈ దేశానికి భవిత.వారి వల్ల మాత్రమే ఈ దివ్య ధాత్రి కి నవత,సమత,మమత సిద్ధిస్తాయి అని ఆయన స్పష్టం చేశారు. వివేకానందుడు అందించిన సందేశ, ఉపదేశ భావజాలం నేటి యువతరానికి స్ఫూర్తి మంత్రం! అందుకే ప్రతి ఏటా జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం!
లేవండి!మేల్కొనండి! మీ గమ్యం చేరుకునే దాకా విశ్రాంతి గురించి మర్చిపోండి! ఉత్తేజాన్ని పొందండి! నిస్తేజాన్ని వదలండి!మన దేశ వారసత్వ పరంపర గురించి తెలుసుకోండి! మనదైన ఘనమైన సాంస్కృతిక చారిత్రక వైభవం లో మీరు కూడా పాలు పంచుకోండి.. అని ఆయన పేర్కొన్నారు.
చైతన్య సుథ
1863 వ సంవత్సరం జనవరి 12న జన్మించిన వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తు. రామకృష్ణ పరమహంస దర్శనంతో ఆయన వివేకానంద అయ్యారు. మన దేశం ప్రపంచ దేశాలలో తలమానికమవుతుంది. అయితే అందుకు కండబలం కాదు. ఆత్మ బలం కావాలి. ఆత్మశక్తితో దానిని సాధించాలి. ప్రేమాస్పద భావనలతో మన జాతి వెల్లివిరియాలి... అని స్వామి వివేకానంద బోధించారు. యువతలో దేశభక్తిని నెలకొల్పేందుకు ముందుగా మన సంస్కృతి సంప్రదాయాల పట్ల వారికి అనురక్తి కలిగించారు. వారి హృదయాల్లో సేవా భావాన్ని అంకురింప చేశారు. సర్వ మానవ సమానత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ' ఏదైనా కార్యం పట్ల సంసిద్ధత, నిర్వహిస్తున్న కార్యక్రమం పట్ల విధేయత, ఆ పనిని పూర్తిచేయాలని చిత్తశుద్ధి ఉంటే మిమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదు. మనకు ప్రధానంగా కావలసినవి ప్రేమించే హృదయం, యోచించే మనసు కష్టించే శరీరం. వీటి ద్వారా అసాధ్యాలని సుసాధ్యం చేయవచ్చు'... అని ఆయన పేర్కొన్నారు. మన భవిష్యత్తుకు మనమే బాధ్యులం. మన భావి జీవితానికి మనమే విధాతలం. మన అభ్యున్నతికి మనమే నిర్దేశకులం. ఈ విషయంలో ఎవరినీ నిందించి ప్రయోజనం ఉండదు . నీవు అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగాలంటే,అందుకు ఆత్మ శక్తితో, కార్య దక్షతతో ముందడుగు వేయాలి. ఇంతకుమించి మరో ఉపాయం లేదని ఆయన స్పష్టం చేశారు. వికాసమే అసలైన జీవనం. సంకోచత్వమే ప్రతిబంధకం. మనపై మనకు విశ్వాసం, దైవం పై నమ్మకం అనేవి మనల్ని వెలుగు జాడల వైపు నడిపించే కరదీపికలు. ముక్కోటి దేవతలపై మీకు ఎంతో నమ్మకం ఉన్నా, మీపై మీకు ఆత్మ విశ్వాసం లేకపోతే మీరు ఏమీ సాధించలేరని ఆయన మార్గదర్శనం చేశారు.
విశ్వగురువు
1893 వ సంవత్సరంలో చికాగోలోని సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు ప్రసంగించారు.సోదర సోదరీమణులారా! అనే అభిమాన పూర్వక,ఆప్యాయకర సంబోధనతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ ఆత్మీయ పలకరింపు ప్రపంచ దేశాల ప్రతినిధుల హృదయాలను ఎంతో ఆకట్టుకుంది. భారతీయ ఆధ్యాత్మిక చింతనను విశ్వమంతా వ్యాప్తి చేసి,మన దేశ ఘనతను ఆయన ఆ వేదికపై వివరించారు. 'ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇంకా ఊపిరి పోసుకోకముందే నా భారతావనిలో వేద నాదాలు సుస్వరంగా మారుమ్రోగాయి. పురాణ ఇతిహాసాలు ప్రభవించాయి. సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పరిమళించాయి. సమస్త ప్రపంచానికి నా దేశం గురు పీఠమై వర్ధిల్లుతోంది. ఇప్పటికీ, ఎప్పటికీ ఈ జగత్తుకి మకుటాయమానమైన స్థానంలో నా భారతదేశం నిలిచి ఉంటుంది. నా భరతమాత సకల సంపత్సమేత' అని ప్రపంచమంతా పులకరించేలా మనదేశ దివ్య యశస్సుని స్వామి వివేకానంద చాటి చెప్పారు.
సమాజమే దేవాలయం
వివేకానందుడు అందించిన సందేశ స్ఫూర్తి సర్వదా ఆచరణ యోగ్యం. సాటి మనిషికి సేవ చేయని వ్యక్తులు ఎన్ని తీర్థయాత్రలు చేసినా అది వృధాప్రయాస అవుతుంది.మానవత్వాన్ని చాటుకోటమే అసలైన ఆధ్యాత్మిక చింతన. దేవాలయానికి వెళ్లి దైవ ప్రార్థనలు చేసే వారి కన్నా, దీనులకు, రోగులకు సేవలు చేస్తూ వారికి పరిచర్యలు చేసే వారినే దేవుడు త్వరితంగా అనుగ్రహిస్తాడు. మతాల సారాంశం ఒక్కటే. ఒక లక్ష్యానికి భిన్నమైన దారులు ఉన్నట్లుగా,అన్ని మతాలు ప్రబోధించేది మానవీయ విలువలనే! మనలోని చెడు ప్రవృత్తిని నిర్మూలించి, ప్రతికూలతలను నిలువరించినప్పుడే మనిషిలో వివేకత్వం, వివేచన ఉదయిస్తాయి.పవిత్ర హృదయంతో మసులుకోవటం, అందరి యోగక్షేమాలని ఆకాంక్షించడమే అసలైన పూజ గా వివేకానందుడు అభివర్ణించారు.
లౌకికపరమైన భోగలాలసత్వాన్ని విడనాడి, అలౌకికమైన ఆధ్యాత్మిక చింతన వైపు మనసుని మళ్లించుకోవడం ద్వారా అద్భుతాన్ని ఆస్వాదించవచ్చు. ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా మించిన ఆధ్యాత్మిక సేవ మరొకటి లేదు. వ్యక్తులందరూ దైవస్వరూపలే. ప్రతి వ్యక్తిలోనూ దైవత్వాన్ని దర్శించాలి. పరుషమైన మాటలకన్నా,దయతో కూడిన పలకరింపు వ్యక్తుల్ని ఉత్తమంగా నిలుపుతాయి. బాహ్య ప్రదర్శన కంటే ఆంతరంగిక పరిశీలన ఘనమైనది. మౌనానికి ఎంతో శక్తి ఉంది. మౌనం కూడా ఉపదేశమే! సత్యమనేది కేవలం మాటల్లోనే కాదు,మన చేతల్లో ఉండాలి. ఆచరణాత్మకంగా సత్యాన్ని,ధర్మాన్ని ఆచరించి చూపాలి. భగవంతుడు కేవలం ఆలయంలో మాత్రమే కాదు. మన హృదయాలయంలోనూ ఉన్నాడు. సాధనతో, శోధనతో ఆ దైవత్వాన్ని దర్శించగలగాలి.. అని స్వామి వివేకానంద తన చైతన్య వాణిని ఆవిష్కరించారు.
స్ఫూర్తి మంత్రం
ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి.ఎవరిలో దైవత్వాన్ని వారే గుర్తించాలి . ఎవరి చేతనత్వాన్ని వారే సాధించాలి అన్నారు స్వామి వివేకానంద. దేవుడు మన ప్రతిబింబం.దేవుడు మనిషిని తన పోలికలతో సృష్టించాడు అని కొందరు అంటుంటారు. కానీ దీనిని వివేకానంద అంగీకరించలేదు.మానవుడే భగవంతుణ్ణి తన పోలికలతో సృజించాడు. అందుకే ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని దర్శించడం భారతీయత అని ఆయన అన్నారు. బలహీనులు ఎప్పుడు ఆత్మసిద్ధిని పొందలేరు . దేవా! నేను మహాపాపిని, పాపాత్ముడను అని ఎవరూ,ఎప్పుడు అనకూడదు. అది ఆర్షధర్మ సిద్ధాంతం కాదు. నేను పుణ్యాత్ముడిని, పరోపకారం చేయడానికి నేను ఉద్భవించాను అని ఎవరికి వారు భావించుకోవాలి.ఆత్మబలం లేకపోతే ఎవరైనా ఏదీ సాధించలేరు. లోకోద్దరణ కోసం ప్రతి వ్యక్తి ఉద్భవించాడని గుర్తించాలి . నీకు నువ్వు సహాయచేసుకుంటూ, సమాజానికి చేయూతనందించగలగాలి. అప్పుడే మన జన్మకు సార్థక్యం అన్నారు వివేకానంద!
విశ్వ సృష్టికర్తవు, సంధానకర్తవు నీవే అలాంటి నీకు తోడ్పడే వారంటూ ఎవరూ ఉండరు అని గుర్తుంచుకోవాలి . ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారనే భావన విడనాడాలి. ప్రతికూల భావాలను ఛేదించుకొని, అనుకూల చైతన్య పధం వైపు పురోగమించాలి. గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక ఉద్భవించినట్లుగా నిన్ను నువ్వే తీర్చిదిద్దుకొని రేపటి ఆనందకరమైన భవిష్యత్తు కోసం నిన్ను నువ్వు సమాయత్తం చేసుకోవాలని యువతరానికి స్వామి వివేకానంద హితోపదేశం చేశారు.
యువతా! మేలుకో!
ఆత్మవిశ్వాసంతో కూడిన కొందరు వ్యక్తుల వల్ల ఈ ప్రపంచ గమనం పూర్తిగా మారిపోయింది. అలాంటి వారి చరిత్ర ప్రపంచ చరిత్ర. ఎవరిపై వారికిఉండే చెదరని విశ్వాసం వారిలో దివ్యత్వాన్ని వెలికితీస్తుంది.ధ్యానం,ఉపాసన, యోగం, జ్ఞానం,కర్మ,భక్తి ఈ మార్గాల్లో దేన్నైనా స్వీకరించండి. శ్రద్ధగా అభ్యసించండి అని ఆయన పేర్కొన్నారు. కలకాలం నిలిచేది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే! సత్ప్రవర్తనే మనిషిని సమాజంలో అచంచలంగా నిలుపుతుంది.ప్రేమ అనేది భౌతికమైనది కాదు. అది కాలాతీతమైనది. సార్వజనీనమైనది. సర్వకాల సర్వావస్థలో కొనసాగాల్సినది. నా ఆశ,నా ధ్యాస,నా శ్వాస అంతా ఈ దేశ యువత మీదనే ఉంటుంది. నా మాటల్లోని ఆర్తిని,నా సందేశంలోని స్ఫూర్తిని వారు స్వీకరించాలి. కాలాలు మారినా, తరాలు తరిగినా యువతరం ధోరణిలో మార్పు రాకూడదు. వారిపై నవ్య ధోరణుల అవాంఛనీయ ప్రభావం ఉండకూడదు.మనదైన భారతీయ విలువలను సమ్మిళితం చేసుకుంటూ, మన దేశాన్ని ఆదర్శప్రాయంగా ప్రపంచ యవనికపై నిలపాలి.ఇదే నా ఆకాంక్ష! అన్నారు స్వామి వివేకానంద.
స్వామి వివేకానంద భౌతికంగా జీవించింది 39 సంవత్సరాలే! కానీ ఆయన అందించిన సందేశ జాగృతి యుగయుగాలకు మార్గదర్శనం చేస్తుంది. యువతరం ఆదర్శప్రాయంగా ఉంటే ఎంతటి మహోన్నత విజయాలనైనా సాధించవచ్చు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందిస్తుంది భారతీయ వేదాంత తత్వాన్ని ఆయన తన జీవన పర్యంతం ఆవిష్కరించారు సరళ సుందరంగా ఉత్తేజభరితంగా ఈ జాతికి దిశానిర్దేశం చేశారు. జగతిని జాగృత పరుస్తూ చైతన్య శంఖాన్ని పూరించారు!